స్వయానా తల్లితో పార్టీ నుంచి గెంటివేయబడ్డ అనుప్రియ... నేడు సగర్వంగా మోదీ జట్టులో!
అనుప్రియా పటేల్... నేడు మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్న 19 మంది కొత్త మంత్రుల్లో అత్యధికులను ఆకర్షించిన 36 ఏళ్ల యువతి. యూపీలోని మీర్జాపూర్ నుంచి పార్లమెంటుకు ఎంపికైన అనుప్రియ ప్రస్తుతం మోదీ క్యాబినెట్ లో అత్యంత పిన్న వయసులో మంత్రి అయిన కొద్ది మందిలో ఒకరు. "ప్రధాని నాపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా" అని ప్రమాణ స్వీకారం అనంతరం అనుప్రియ వ్యాఖ్యానించారు.
ఇక అనుప్రియ కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన వేళ, కచ్చితంగా ఆమె తల్లి కృష్ణా పటేల్ ఆనందంగా ఉండకపోవచ్చు. ఆమె ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అప్నాదళ్ పార్టీకి చీఫ్. గత సంవత్సరం తన కుమార్తె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, ఆరేళ్ల పాటు అనుప్రియను సస్పెండ్ చేసింది. వాస్తవానికి వీరిద్దరి మధ్యా దాదాపు ఏడేళ్లుగా ఆధిపత్య పోరు సాగుతోంది. అనుప్రియ తండ్రి, కృష్ణా పటేల్ భర్త, 'అప్నాదళ్' వ్యవస్థాపకుడు సోనేలాల్ పటేల్ 2009లో రహదారి ప్రమాదంలో మరణించిన తరువాత, పార్టీలో నియంత్రణ ఎవరి వద్ద ఉండాలన్న విషయమై తల్లీ కూతుళ్ల మధ్య ఎన్నోమార్లు గొడవలు జరిగాయి.
నిజమైన అప్నాదళ్ తమదంటే తమదని వీరిద్దరి మధ్యా వాగ్వాదాలు జరిగాయి. ఇక యూపీలో అనుప్రియ నేతృత్వంలోని అప్నాదళ్ మాత్రమే తమకు సరైన భాగస్వామిగా నరేంద్ర మోదీ నమ్మారని, అందువల్లే మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. దీనికితోడు వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండటం, నిర్ణయాత్మకమైన ఓటు బ్యాంకును కలిగివున్న కుర్మీ వర్గానికి చెందిన యువతిగా, అధిక ఓట్లను ఆకర్షించగలిగే చరిష్మా ఉన్న మహిళా నేతగా అనుప్రియ తమకు ప్లస్ పాయింట్ అవుతారని మోదీ భావించే ఆమెకు తన టీములో స్థానమిచ్చారని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం అప్నాదళ్ కు లోక్ సభలో ఇద్దరు సభ్యులుండగా, అనుప్రియతో పాటు ఎంపీగా ఉన్న హరివంశ్ సింగ్ మాత్రం కృష్ణా పటేల్ వర్గంలోనే ఉన్నారు. తన కూతురికి మంత్రి పదవిని ఇస్తే, ఎన్డీయే నుంచి తెగతెంపులు చేసుకుంటామని కృష్ణా పటేల్ హెచ్చరించగా, తమదే అసలైన పార్టీ అని అనుప్రియ వర్గం వాదిస్తోంది.